ప్రతి అమెరికన్‌కి 2వేల డాలర్లు..
ట్రంప్ బ్లాస్టింగ్ అనౌన్స్‌మెంట్!
కాకతీయ, అంతర్జాతీయం : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన నిర్ణయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఆయన విదేశీ దేశాలపై టారిఫ్‌లు (సుంకాలు) విధించే నిర్ణయాలను మరింత కఠినతరం చేస్తూ.. ` ఇది దేశ ప్రయోజనాల కోసం` అని ప్రకటించారు. కానీ ఈ చర్యల వల్ల ఆయన అమెరికా సుప్రీంకోర్టులో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అధ్యక్షుడి అధికారాలు ఎక్కడివరకు అనే ప్రశ్నలు న్యాయస్థానంలో వినిపిస్తుండగా, ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
సుప్రీంకోర్టు ట్రేడ్ పాలసీలపై వ్యక్తం చేసిన సందేహాలకు ట్రంప్ ఘాటుగా స్పందించారు. “అమెరికా అధ్యక్షుడికి వాణిజ్య నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం ఉంది. ఇతర దేశాలు మనపై సుంకాలు వేస్తుంటే మనం ఎందుకు వేయకూడదు? ఇది జాతీయ ప్రయోజనాల కోసం చేస్తున్న పని” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకాలు విధించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడిందని, వందల కంపెనీలు అమెరికాలోకి తిరిగి వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
ప్రతి అమెరికన్‌కి $2000 డివిడెండ్..
టారిఫ్‌ల ద్వారా భారీ ఆదాయం వస్తోందని వెల్లడించిన ట్రంప్, ఆ ఆదాయం నుంచి ప్రతి అమెరికన్ పౌరుడికి కనీసం 2వేల డాలర్ల డివిడెండ్ ఇవ్వనున్నట్లు బ్లాస్టింగ్ అనౌన్స్‌మెంట్ చేటంఇరు. “సుంకాల కారణంగా అమెరికా ఇప్పటి వరకు ఉన్న దానికంటే బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉంది, స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ ఆదాయం ప్రజలకే చెందింది కాబట్టి వారితో పంచుకుంటాం” అని ఆయన తెలిపారు. అయితే ఈ పథకం అధిక ఆదాయం ఉన్న సంపన్నులకు వర్తించదని, అది కేవలం మిడిల్ మరియు లోయర్ ఇన్‌కమ్ గ్రూప్‌లకు మాత్రమే అమలవుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా అమెరికా రుణం ప్రస్తుతం 37 ట్రిలియన్ల డాలర్లకు చేరిందని, ఆ మొత్తాన్ని టారిఫ్‌ల ద్వారా పొందిన ఆదాయంతో క్రమంగా తీర్చుతామని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు అమెరికా ప్రజలకు తాత్కాలికంగా సంతోషాన్నిచ్చినా, ప్రపంచ ఆర్థిక రంగంలో కలకలం సృష్టించే అవకాశముంది. ఇప్పటికే ట్రంప్ సుంకాల విధానం పట్ల ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనా, యూరోపియన్ యూనియన్, కెనడా వంటి దేశాలు అమెరికా సుంకాలను వాణిజ్య యుద్ధానికి దారితీసే చర్యలుగా పేర్కొన్నాయి. కానీ ట్రంప్ మాత్రం ఇతర దేశాల ప్రయోజనాల కోసం అమెరికా దెబ్బతినదు అని బలంగా చెబుతున్నారు.


