భద్రాచలంలో గోదావరిలో 1వ హెచ్చరిక
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
: మంత్రి పొంగులేటి ఆదేశాలు
కాకతీయ, భద్రాచలం : గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుతుండడంతో భద్రాచలంలో 1వ హెచ్చరిక అమల్లోకి వచ్చింది. ఉదయం 08.15 గంటలకు నీటి మట్టం 43.00 అడుగులకు చేరి ప్రవాహం 9,32,288 క్యూసెక్కుల వద్ద నమోదయిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసి జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
అధికారులకు ప్రత్యేక ఆదేశాలు
ప్రజల ప్రాణరక్షణలో ఎలాంటి లోటు చోటుచేసుకోకూడదని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆరోగ్య తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నది పరివాహక గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు ముందుగానే సమాచారం అందించడంతో పాటు అవసరమైతే వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితులలో సహాయక బృందాలు సిద్ధంగా ఉండాలని, గ్రామ స్థాయిలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు. “ప్రతి గ్రామంలో పరిస్థితిని నిమిషానికోసారి పరిశీలించాలి. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబడదు” అని మంత్రి స్పష్టం చేశారు.


