కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు 15 గుంటలు
శాతవాహన యూనివర్సిటీ కీలక నిర్ణయం
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం.. శాశ్వత భవనానికి మార్గం సుగమం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో శాంతిభద్రతల బలోపేతానికి శాతవాహన విశ్వవిద్యాలయం కీలక ముందడుగు వేసింది. యూనివర్సిటీ పరిధిలోని 15 గుంటల భూమిని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ శాశ్వత భవన నిర్మాణానికి కేటాయిస్తూ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యు. ఉమేష్ కుమార్ వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 24న నిర్వహించిన 84వ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదం పొందినట్లు తెలిపారు. మల్కాపూర్ జంక్షన్ నుంచి చింతకుంట వెళ్లే ప్రధాన రహదారిపై, శాతవాహన యూనివర్సిటీ వెస్ట్ గేట్‌కు ఆనుకుని ఉన్న భూమిని పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించినట్లు వీసీ వివరించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా అధికారికంగా *నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌వోసీ)*ను నగర పోలీస్ కమిషనర్‌కు అందజేసినట్లు తెలిపారు.
భద్రతకు ఉపయోగకరం
ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, యూనివర్సిటీ పరిసరాలు, కరీంనగర్ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ శాశ్వత భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. విద్యార్థుల భద్రత, నిరంతర నిఘా దృష్ట్యా యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునిల్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సతీష్ కుమార్, డా. హరికాంత్, కంట్రోలర్ డా. డి. సురేష్ కుమార్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ విజయకుమార్, ఇన్‌స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, ఎస్సై సాంబమూర్తి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


