వేయి స్తంభాల ఆలయ అభివృద్ధికి 14.44 కోట్లు మంజూరు
కేంద్రం నిధులతో పునరుద్ధరణ పనులకు శ్రీకారం
పర్యాటకాభివృద్ధికి మార్గం సుగమం
నిరంతర కృషితో నిధులు సాధించిన ఎంపీ కడియం కావ్య
కాకతీయ, హనుమకొండ : వేయి స్తంభాల గుడి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 14.44 కోట్ల నిధులు మంజూరు చేయడం ద్వారా ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు ప్రారంభమవుతున్నాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. ఆలయ అభివృద్ధితో పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. హనుమకొండలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడం వేయి స్తంభాల గుడి అభివృద్ధికి ఈ నిధులు మంజూరయ్యాయి. కల్యాణ మండపం అభివృద్ధి, విస్తరణతో పాటు పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. కాకతీయుల కాలం నాటి శిల్ప వైభవాన్ని పునరుద్ధరించడం ప్రధాన లక్ష్యంగా పనులు కొనసాగనున్నాయి.
పనుల ప్రారంభానికి రంగం సిద్ధం
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను పలుమార్లు కలిసి ఆలయ అభివృద్ధి అవసరాన్ని ఎంపీ వివరించారు. పురావస్తు శాఖ అధికారులతో కలిసి ఆలయాన్ని పరిశీలించి ప్రతిపాదనలు సమర్పించారు. కేంద్ర పురావస్తు శాఖ టెండర్లు పిలవడంతో పనుల ప్రారంభానికి మార్గం సుగమమైంది. పనులను త్వరితగతిన పూర్తి చేసి ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని ఎంపీ కోరారు. ఆలయ అభివృద్ధితో పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా లాభం చేకూరుతుందని తెలిపారు. వారసత్వాన్ని కాపాడుతూ అభివృద్ధి లక్ష్యంగా కృషి కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పురావస్తు శాఖ అధికారులకు ఎంపీ కడియం కావ్య కృతజ్ఞతలు తెలిపారు.


