11 ఏళ్ల పగ…పెళ్లి వేడుకలో రక్తపాతం
వరుసకు బావపై దాడి అడ్డుకున్న వ్యక్తి దారుణ హత్య
కొడుకు మృతి కక్షతో ముందస్తు ప్రణాళిక
నిందితుడి అరెస్ట్.. వివరాలు వెల్లడించిన ఏసీపీ
కాకతీయ, పెద్దపల్లి: పెళ్లి సంబరాలు జరుగుతున్న వేళ 11 సంవత్సరాల పాత కక్ష రక్తపాతానికి దారితీసిన ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో సంచలనం సృష్టించింది. వరుసకు బావపై దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిని అడ్డుకునేందుకు ముందుకొచ్చిన మొలుగూరి కొమురయ్య (58)పై నిందితుడు కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. శనివారం సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో బంధువు వివాహానికి హాజరైన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాత విభేదాలతో అక్కడికి చేరుకున్న బుర్ర (గుర్ర) రాజకొమురయ్య, మొలుగూరి సత్తయ్యపై దాడి చేయడానికి ప్రయత్నించగా మధ్యలో అడ్డుకున్న కొమురయ్యపై విచక్షణారహితంగా కత్తిపోట్లకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన కొమురయ్యను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందగా, ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో సంచలన వివరాలు
దర్యాప్తులో నిందితుడు రాజకొమురయ్య కుమారుడు 11 సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆ ఘటనకు మొలుగూరి కొమురయ్య, అతని భావ సత్తయ్య కారణమన్న అనుమానంతో దీర్ఘకాలంగా కక్ష పెంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ వివాహ వేడుకలో ముందస్తు ప్రణాళికతో దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై రామగిరి పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి సోమవారం నిందితుడిని అరెస్ట్ చేసింది. నిందితుడు ఉపయోగించిన కత్తి, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీపీ తెలిపారు. కేసులో పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.


