108మంది మావోయిస్టుల లొంగుబాటు
సరెండరయిన వారిలో 44 మంది మహిళా మావోయిస్టులు
101 అత్యాధునిక ఆయుధాలను పోలీసులకు అప్పగింత
భారీగా నగదు, బంగారం ఆయుధాల డంపు స్వాధీనం
బస్తర్ డివిజన్ కేంద్రం జగదల్‌పూర్‌లో లొంగుబాటు కార్యక్రమం
మావోయిస్టులపై మొత్తం రూ.3.29 కోట్ల రివార్డు
చత్తీస్‌గడ్‌లో ‘ఆపరేషన్ కగార్’ మరింత ముమ్మరం
రాయపూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బస్తర్ డివిజన్‌లోని జగదల్‌పూర్ కేంద్రంలో నేడు ఒకేసారి 108 మంది మావోయిస్టులు భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటన రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతలో కీలక పరిణామంగా మారింది. లొంగిపోయిన వారిలో 44 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరందరూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినవారని వెల్లడించారు. వీరిపై ప్రభుత్వం మొత్తం రూ.3.29 కోట్ల రివార్డు ప్రకటించినట్లు తెలిపారు. బస్తర్ డివిజన్ ప్రధాన కార్యాలయం జగదల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ మావోయిస్టులు లొంగిపోయారు. లొంగుబాటు సందర్భంగా తమ వద్ద ఉన్న 101 అత్యాధునిక ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇందులో ఏకే-47 తుపాకులు, ఇన్సాస్ రైఫిళ్లు వంటి ఆయుధాలు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
భారీ డంపు బయటపడింది
లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు అడవుల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ ఆయుధాల డంపు బయటపడింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో భారీ మొత్తంలో నగదు కూడా ఉంది. మొత్తం రూ.3.61 కోట్ల నగదు, సుమారు రూ.1.64 కోట్ల విలువైన ఒక కిలో బంగారం కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా పేలుడు పదార్థాలు, తుపాకులు, ఇతర సామగ్రి కూడా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టులు అడవుల్లో దాచిన ఈ డంపు బయటపడటం భద్రతా దళాలకు పెద్ద విజయంగా భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో గత కొంతకాలంగా మావోయిస్టుల లొంగుబాట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు. 2024 సంవత్సరం నుంచి ఇప్పటివరకు మొత్తం 2625 మంది మావోయిస్టులు లొంగిపోయి సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చారని వెల్లడించారు. ప్రభుత్వ పునరావాస పథకాలు, భద్రతా దళాల చర్యల వల్లే ఈ మార్పు కనిపిస్తోందని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పునరావాసం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అడవులు విడిచి సాధారణ జీవన స్రవంతిలో కలవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.
‘ఆపరేషన్ కగార్’ ముమ్మరం
మరోవైపు మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిగా అణిచివేయడానికి భద్రతా దళాలు విస్తృతంగా ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించిన 31 మార్చి 2026 గడువులోగా దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ కగార్’ను భద్రతా దళాలు ముమ్మరం చేశాయి. అడవుల్లో కాంబింగ్ ఆపరేషన్లు కొనసాగిస్తూ మావోయిస్టుల కదలికలను అణచివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అడవుల్లో జరుగుతున్న ఆపరేషన్లు, ప్రభుత్వ పునరావాస విధానాల ప్రభావంతో మావోయిస్టుల ప్రభావం క్రమంగా తగ్గుతోందని పోలీసులు తెలిపారు. ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్టులు కూడా ఆయుధాలు విడిచి లొంగిపోవాలని అధికారులు పిలుపునిచ్చారు.


