బైక్పై 103 పెండింగ్ చాలన్లు
తనిఖీల్లో పట్టుకున్న కాజీపేట ట్రాఫిక్ పోలీసులు
సీజ్ చేసి.. స్టేషన్కు తరలింపు
కాకతీయ, హనుమకొండ : కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద మొత్తంలో పెండింగ్ చలాన్ల వాహనంపై ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న పర్యవేక్షణలో ఎస్సై కనక చంద్రం, ఎస్సై సంపత్ నేతృత్వంలో కాజీపేట చర్చి వద్ద వాహన పరిశీలనలు నిర్వహించారు. తనిఖీల సమయంలో ఒక ద్విచక్ర వాహనాన్ని ఆపిన పోలీసులు, దానిపై మొత్తం 103 పెండింగ్ ఛాలన్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఛాలన్లకు గాను చెల్లించాల్సిన మొత్తం రూ. 25,105. భారీగా బకాయిలు ఉండడంతో పోలీసులు వాహనాన్ని వెంటనే సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకుండా వరుస ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, బకాయి ఛలన్లు ఉంటే వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.


