కొత్త రేషన్ కార్డులతో పేదల జీవితాల్లో సంతోషం : ఎమ్మెల్యే డా మురళీ నాయక్

కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్దిదారులకు ఆహార భద్రత పథకం కింద కొత్త రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా మురళీ నాయక్ గారు మాట్లాడుతూ.. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదల పట్ల తీవ్ర అన్యాయం చేశాయి. గత పది సంవత్సరాలపాటు రాష్ట్రంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేయలేదు. పేదలు ఎన్నిసార్లు ప్రయత్నించినా, వారి మొరల్ని పెదవిపైకి తీసుకురాలేకపోయారు. కాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనలో, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదల కష్టాలను అర్థం చేసుకుని, వారి సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. ఆహార భద్రతతో పాటు, రేషన్ కార్డు ద్వారా పేదలకు అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయని, ఇది న్యాయమైన హక్కుగా పరిగణించాలని అన్నారు. పల్లె ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ నెల 25 నుండి వచ్చే నెల 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని అన్నారు. రేషన్ కార్డులు పంపిణీ చేసి, కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి నెలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వడం భారతదేశ చరిత్రలో నే ఒక రికార్డు. ఇలా అతి తక్కువ కాలంలోనే పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించి పేదల ప్రభుత్వంగా ప్రజాధారణ పొందింది అని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మనం వెనకబడిపోయాము. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పి కొట్టలేకపోతున్నారు అని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమాలను ఈ కరపత్రం ద్వారా గడప గడపకు చేరవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు,మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ నాయకులు,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, లబ్దిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లబ్దిదారులు తమకు రేషన్ కార్డు అందించిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.


