ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత గాని ఈ మానవ జన్మ సాధ్యం కాదు
ఈ జన్మలోనే మోక్ష సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
స్వామి తత్పదానందజీ పిలుపు

కాకతీయ, హన్మకొండ : గురుదేవులు చెప్పినట్లు మానవ జీవిత లక్ష్యం భగవత్ సాక్షాత్కారమేనని ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత గాని ఈ మానవ జన్మ సాధ్యం కాదని ఈ జన్మలోనే మోక్ష సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హైదరాబాద్ రామకృష్ణ మఠం స్వామీజీ “తత్పదానంద మహారాజ్”పిలుపునిచ్చారు. శ్రీ రామకృష్ణ సేవాసమితి కేఎల్ఎన్ రెడ్డి కాలనీ హనుమకొండ యందు గురుదేవులు శ్రీరామకృష్ణ పరమహంస భక్తుల “సత్సంగ్” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తత్పదానంద మహారాజ్ విచ్చేసి ప్రసంగించారు. జీవితంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యమని ప్రతిరోజు ఉదయం లేవగానే కనీసం ఒక నిమిషం పాటైనా భగవంతుని గురించి ప్రార్థన చేయాలని భగవద్గీతలో బోధించినట్లు ఫలితాన్ని భగవంతునికే వదిలివేసి కర్మలు నిర్వహించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సేవాసమితి అధ్యక్షులు కటంగూరి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెలలో 2వ శనివారం హనుమకొండ రామకృష్ణ ధ్యాన మందిర్ యందు సత్సంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గురుదేవుల ఆశయానికి అనుగుణంగా నెలలో ఒక రోజు ఇంటికి దూరంగా పూర్తిగా సాధు సన్యాసుల& భక్తుల సమక్షంలో సాధన చేయడం జరుగుతుందని తెలిపారు. స్వామీజీ మార్గదర్శనంలో సూచనాత్మక ధ్యానాన్ని నిర్వహించడం జరిగింది శ్రీ శారద మాతృమండలి ఆధ్వర్యంలో సామూహిక “లలిత చాలీసా” మరియు భజనలు చేయడం జరిగింది. రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ గౌరవ ప్రతినిధి సూర్య ప్రకాష్ గారు మాట్లాడుతూ భారత జాతీయ జీవనానికి “ఆధ్యాత్మిక చింతన” మూలమని ఆధ్యాత్మికతను వదిలివేస్తే దేశం తిరిగి బానిసత్వానికి వెళ్తుoదని, ఆధ్యాత్మికంగా ప్రతి వ్యక్తిని ఉన్నతంగా తయారు చేయడమే రామకృష్ణ సేవా సమితుల ప్రధాన కర్తవ్యమని వివరించారు . ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ కవి, న్యాయవాది ఏరువాక జయశంకర్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులలో దేశభక్తి, జాతీయత భావనలను కల్పించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి బృందావన్ అపార్ట్మెంట్ వాస్తవ్యులు మరియు సేవాసమితి విశిష్ట ధర్మకర్త డా॥ టి.వి. రమణాకర్ గారు భగవాన్ శ్రీరామకృష్ణ ధ్యాన మందిర నిర్మాణానికి మరో లక్ష రూపాయల విరాళం వారి ఉదార ధాతృత్వానికి నిదర్శనం. ఇంకా ఈ కార్యక్రమంలో సేవాసమితి రిటైర్డ్ ప్రొఫెసర్లు డా॥ రమణమూర్తి, రామన్న, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సౌమిత్రి లక్ష్మణాచార్య, భజన కార్యక్రమ నిర్వాహకులు భాస్కర్, స్వరూప, రాధిక, అంజనీ దేవి, శిల్ప, సేవా సమితి ప్రతినిధులు శ్రీనివాస స్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, కె వి రావు, తిరుపతిరెడ్డి, లక్ష్మీదేవి, లక్ష్మీ రావు, పార్వతి, అరుణ్, విష్ణు, సుమారు 100 మంది భక్తులు పాల్గొన్నారు.


