ఉద్దేశ పూర్వకంగానే కాళేశ్వరం నిర్మాణం
కేసీఆర్ డైరెక్షన్‌లో బ్యారేజీ నిర్మాణాలు
కాకతీయ,తెలంగాణబ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలు అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ను భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సోమవారం మంత్రివర్గ సమావేశంలో నివేదించారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక సారాంశాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్లానింగ్ నుంచి నిర్మాణం, బ్యారేజ్ ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వరకు జరిగిన అవకతవకలు అక్రమాలకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని ఘోష్ నివేదిక వెల్లడించినట్లు తెలిపారు. కేసీఆర్‌తో పాటు అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావును సైతం కమిషన్ బాధ్యుడిగా పేర్కొందని మంత్రి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దని నిపుణుల కమిటీ నివేదిక సమర్పించినా ఉద్దేశపూర్వకంగా ఆ నివేదిక ను తొక్కి పెట్టారని ఘోష్ కమిషన్ రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు తెలిపారు.


