తెలంగాణ ప్రజలకు ప్రైవసీ లేదు
బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాకతీయ, హైదరాబాద్ : రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు ప్రైవసీ లేకుండా పోయిందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విషయంలో తనకు నోటీసులు వస్తున్నాయని ఓ వారం రోజుల ముందుగానే ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసిందన్నారు. ఎంతో గోప్యంగా జరుగుతున్న కేసుల విషయాలను కూడా రన్నింగ్ కామెంటరీలా సీఎం సదరు దినపత్రిక యాజమాన్యానికి లీక్ చేస్తున్నారంటూ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ప్రవీణ్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసును అసలు విచారణ చేపడుతున్నది.. నడుపుతున్నది స్పెషల్ ఇన్వస్టిగేషన్ టీమా లేకుంటే ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యామా అన్న సందేహం కలుగుతోందంటూ విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి కేస వివరాలను లీక్ చేస్తున్నారంటూ ఆరోపించారు. పోలీసులు ఇప్పటికైనా ప్రభుత్వంలో నాయకులకు అనుగుణంగా పనిచేయకుండా నిక్ష్పాక్షికంగా వ్యవహరించాలని అన్నారు. నిజాయితీగా పనిచేస్తే ప్రజలు హర్షిస్తారని, ఒకే పార్టీ ప్రభుత్వంలో ఒకపార్టీ ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.


