యూరియా రైతులకు సమృద్ధిగా అందాలి
నిర్ధేశించుకున్న ఆయిల్ ఫామ్ లక్ష్యాలను అధిగమించాలి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

కాకతీయ, జనగామ : యూరియాను రైతులకు సమృద్ధిగా అందజేయాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం యూరియా విక్రయాలు, ఆయిల్ ఫామ్ లక్ష్యాలపై వ్యవసాయ, పోలీస్, ఉద్యాన శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. యూరియా రైతులకు కావాల్సిన విధంగా పంపిణీ అయ్యేలా అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రతి ఫెస్టిలైజర్ షాపును తనిఖీ చేయాలన్నారు. యూరియా స్టాక్ వివరాలు బోర్డ్ పై ప్రదర్షింప చేయాలని, రిజిస్టర్ లు పరిశీలించి, గోదాం లు తనిఖీ చేయాలన్నారు. యూరియా రాకముందే డీలర్ లతో మాట్లాడి స్టాక్ ను పరిశీలించుకోవాలన్నారు. విక్రయాలలో రైతుకు ఉన్న ఎకరాలను బట్టి బ్యాగ్ ల విక్రయం జరగాలన్నారు. అందుకు రైతు వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయించాలన్నారు. రైతు పేరు, గ్రామం, మండలం, సెల్ నెంబర్ తో సహా నమోదు చేయాలని, అదే విధంగా కొనుగోలు చేసిన యూరియా ను ఎకరాల తో సరి చూడాలన్నారు. ఎకరాలకు సరిపోను యూరియా ను మాత్రమే విక్రయించాలన్నారు. అధికంగా బ్యాగులు విక్రయించకుండా తనిఖీ చేపట్టాలన్నారు. బోర్డ్ పై ఉన్న ధరలను ఆన్ లైన్, ఆఫ్ లైన్ లతో సరిచూడాలని తెలియజేసారు. యూరియా విక్రయాలు క్రమబద్ధంగా జరిగేలా వ్యవసాయ అధికారులు తనిఖీలు చేపడుతూ పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకొని , నిల్వలపై దృష్టి పెట్టాలన్నారు. యూరియా వ్యవసాయానికే వినియోగించాలని, ఇతరత్రాలకు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయిల్ ఫామ్ 25 ఎకరాల లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ర్రైతులకు వెన్నంటి ఉండి ప్రోత్సహించాలని, సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని, లక్ష్యాలు సాధించడంలో జాప్యం జరగరాదన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు జిల్లా లో వనరులు సమృద్ధిగా ఉన్నాయని, వర్షాలు పడుతున్నందున వేగవంతం చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిసిపి.రాజమహేంద్ర నాయక్, ఆర్డీఓ లు గోపిరామ్, డి.ఎస్.వెంకన్న, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి అంబికా సోని, జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీధర్ రావు , వ్యవసాయ శాఖ ఏడీ ఏ లు, ఏ.ఓ.లు, ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు.


