అవినీతికి నో చెప్పాలి.. నిజాయితీకి ఓటేయాలి!
ప్రజల మధ్య ఉండే నాయకులకే పట్టం కట్టాలి
పార్టీలకే కాదు.. క్యారెక్టర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి
ఎన్నికల్లో కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరం
చేర్యాల జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్
కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల్లో అవినీతి రహిత పాలకవర్గాన్ని ఎన్నుకోవాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం చేర్యాల జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ఢిల్లీ, హైదరాబాద్ స్థాయి రాజకీయాలకేమీ సంబంధించినవి కాదని, ఇవి పూర్తిగా గల్లీ స్థాయి పాలనకు సంబంధించినవేనని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు అంటే ప్రజా సమస్యలు, స్థానిక అవసరాలు కీలకమని, ఆ దిశగా ప్రజల మధ్య ఉండి నిరంతరం సేవ చేసే నాయకులకే ఓటు వేయాలని ఆయన సూచించారు. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును సమాజ హితానికి వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
“క్యారెక్టర్, కండక్ట్, కేపబిలిటీ, పబ్లిక్‌తో కనెక్టివిటీ” ఉన్న లీడర్ కావాలి
ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి, ప్రతిపక్ష నాయకుడైన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తమ పార్టీల తరఫున అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో స్పష్టమైన ప్రమాణాలు పాటించాలని డాక్టర్ పరమేశ్వర్ సూచించారు.
“క్యారెక్టర్, కండక్ట్, కేపబిలిటీ, పబ్లిక్‌తో కనెక్టివిటీ” ఉన్న అభ్యర్థులకే టికెట్లు ఇచ్చి ప్రజల్లోకి పంపాలని ఆయన కోరారు. అలా చేసినప్పుడే స్థానిక పాలనపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఆర్థిక అవకతవకలు జరగకుండా ఎన్నికల నిర్వహణ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని జేఏసీ చైర్మన్ డిమాండ్ చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలపై నిఘా పెంచాలని, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగేలా చూడాలని అధికారులను కోరారు.
ఈ సమావేశంలో జేఏసీ నాయకులు అందె అశోక్, బుట్టి సత్యనారాయణ, గడిపే బాల నర్సయ్య, పోలోజు వెంకటాద్రి, ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి, చందా శ్రీకాంత్, వలబోజు నర్సింహా చారి, నంగి కనకయ్య, గోమారపు నర్సయ్య, సిద్ధిరాం భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.


