నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లకు తావుండొద్దు
అభ్యర్థుల సందేహాలు హెల్ప్‌డెస్క్‌లోనే పరిష్కరించాలి
కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణలో చిన్నపాటి తప్పిదాలు కూడా జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయితో కలిసి పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాట్లు, హెల్ప్‌డెస్క్ పనితీరు, పోలీస్ బందోబస్తును పరిశీలించి పలు సూచనలు చేశారు. అభ్యర్థుల వివరాలను రిజిస్టర్‌లో సక్రమంగా నమోదు చేసి, నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి టీ–పోల్ యాప్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించి సీసీ కెమెరాల ద్వారా నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. చొప్పదండి మున్సిపాలిటీ నామినేషన్ కేంద్రాలను కూడా కలెక్టర్ పరిశీలించి, హెల్ప్‌డెస్క్ ద్వారా అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.


