గద్దెకు చేరిన సమ్మక్క తల్లీ..!
కాకతీయ, మేడారం బృందం : మేడారం మహాజాతరలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకల గుట్టను విడిచి సంప్రదాయబద్ధంగా జనంలోకి వచ్చిన సమ్మక్క తల్లి చివరకు గద్దెపైకి చేరుకోవడంతో భక్తులు పారవశ్యంతో పరవశించి పోయారు. ఈ పవిత్ర క్షణాన్ని కళ్లారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. అడుగడుగునా “జయ జయ సమ్మక్క” నామస్మరణతో వనం దద్దరిల్లింది. చిలుకల గుట్ట వద్ద సంప్రదాయ పూజల అనంతరం పూజారులు కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క తల్లిని తీసుకువచ్చారు. మార్గమంతా శివసత్తుల పూనకాలు, డోలి మోతలు, కొమ్ము–బూరల నాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం ఉప్పొంగింది. ఎదురుకోళ్లతో భక్తులు అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. గద్దె ప్రాంతానికి చేరుకున్న వేళ భక్తుల హర్షాతిరేకాలు తారస్థాయికి చేరాయి. గద్దెపై సమ్మక్క తల్లి ప్రతిష్ఠతో జాతరలోని ప్రధాన పూజా కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమైనట్లయ్యింది. భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ, బంగారం (బెల్లం) సమర్పిస్తూ అమ్మవారిని శరణు కోరారు. “మంచిగా జూస్తే మళ్లీ జాతరకు వస్తాం” అంటూ భక్తులు తమ కోర్కెలను అమ్మవారి సన్నిధిలో చెప్పుకున్నారు. ఇక సారలమ్మతో కలిసి తల్లీబిడ్డల దర్శనం కోసం భక్తజనం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.



