రైతులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం
అధికారుల నిర్లక్ష్యంతో ధాన్యం నీటిపాలు
25వేల పంట నష్ట పరిహారం చెల్లించాలి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది డిమాండ్
కాకతీయ ఖానాపురం : మొంథా తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోనీ ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొంథా తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉందని వాతావరణ శాఖ ముందస్తు సమాచారం అందించినా రైతులను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వ అధికారిక వ్యవస్థ నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. అందు వల్లనే రైతులకు అపారనష్టం జరిగిందని దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి చేతికి అంది వచ్చిన వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలు పూర్తిగా నేలమట్టం అయ్యాయని రైతుకు అపార నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కొరతతోనే నష్టపోయిన రైతులను ఈ తుఫాను ప్రభావం వల్ల నిండా మునిగారని తెలిపారు. నష్టపోయిన రైతులను ధైర్యం నింపడానికి కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటని పెద్ది విమర్శించారు. మార్క్ ఫైడ్, సీసీఐ కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించక పోవడంతోనే రైతుల పంటలు కోతకు వచ్చిన కూడ పొలాల్లోనే ఉండటం వల్ల తుఫాను ప్రభావంతో ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయనీ అన్నారు. దీనికి ప్రభుత్వమే పూర్తి భాధ్యత వహించాలనీ, అసమర్ధ పాలనలో అనేక రైతులు ఇబ్బందులు పడుతున్నారనీ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పంట నష్టపోయిన రైతుకు రెండు సార్లు నాటి సీఎం కేసీఆర్ ఎకరాకు పది వేల పంట నష్టపరిహారాన్ని అందజేసిన విషయం గుర్తించాలన్నారు.


