ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే సిట్!
కేసీఆర్‌కు నోటీసులిచ్చేందుకు సన్నద్ధం
రేపు ఫామ్‌హౌస్‌లోనే విచారణకు ఛాన్స్
వయస్సు–భద్రత కారణంగా ప్రత్యేక ఏర్పాట్లు
ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావుల విచారణ పూర్తి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక అడుగు వేయబోతోంది. కేసుకు సంబంధించి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమైంది. ఈ నోటీసులను సిద్దిపేట జిల్లాలోని ఆయన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే అందజేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం సిట్ అధికారులు ఇప్పటికే ఎర్రవల్లి దిశగా బయలుదేరినట్లు తెలుస్తోంది. నోటీసులు అందిన వెంటనే శుక్రవారం కేసీఆర్‌ను విచారించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన వయస్సు, భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్‌కు పిలిపించకుండా ఫామ్‌హౌస్‌లోనే విచారణ చేపట్టాలని సిట్ నిర్ణయించినట్లు సమాచారం. అవసరమైన భద్రతా ఏర్పాట్లతో పాటు, విచారణకు సంబంధించిన విధివిధానాలపై అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.
ఫామ్‌హౌస్‌లోనే విచారణ ఎందుకు?
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి, వయస్సు దృష్ట్యా ఆయనను బయటకు తీసుకువెళ్లకుండా, నివాసంలోనే ప్రశ్నించడమే సమంజసమని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే తరహాలో గతంలో కూడా కీలక నేతల విచారణలు వారి నివాసాల్లోనే జరిగిన ఉదాహరణలు ఉన్నాయని అధికారులు గుర్తు చేస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, అలాగే సంతోష్ రావులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. వారి వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు మరింత లోతుగా సాగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు కేసీఆర్ వరకు సిట్ విచారణ చేరడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
రాజకీయ వేడి పెరిగేనా?
కేసీఆర్‌కు నోటీసులు జారీ అవుతాయన్న సమాచారంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార, ప్రతిపక్ష వర్గాలు దీనిపై తమ తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి. విచారణ ఫలితాలు, తదుపరి చర్యలపై రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
శుక్రవారం జరిగే అవకాశమున్న ఈ విచారణపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉండగా, సిట్ అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారనున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


