మేడారంలో పారిశుధ్య అవస్థలు
మరుగుదొడ్లలో నీళ్లు నిలిచి భక్తులకు ఇబ్బందులు
ట్యాంకర్లతో వెంటనే సరఫరా చేయాలంటూ విజ్ఞప్తి
కాకతీయ, మేడారం బృందం : మేడారం మహాజాతరలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చిలకల గుట్ట సమీపంలోని చెలపాయ చెట్టు వద్ద ఏర్పాటు చేసిన మరుగుదొడ్లలో నల్లాలకు సరైన నీటి సరఫరా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీళ్లు అందక మరుగుదొడ్లలో నీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతుండటంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులు ఈ సమస్యపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు పారిశుధ్యం, మరుగుదొడ్లలో సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ట్యాంకర్ల ద్వారా వెంటనే నీటి సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


