మేడారంలో నిషేధిత అలాలు
పవిత్రతకు భంగం….నిషేధానికి తూట్లు
సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యాపారుల ప్రవర్తన
ఆదివాసీ సంస్కృతి పరిరక్షణపై డిమాండ్
భక్తుల్లో ఆగ్రహం–ఆందోళన
కాకతీయ, మేడారం బృందం : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా ఖ్యాతి గడించిన సమ్మక్క–సారక్క మేడారం మహాజాతరలో పవిత్రతకు భంగం కలిగించే ఘటనలు భక్తులను కలవరపెడుతున్నాయి. జాతర ప్రాంగణంలో మద్యం సేవనాన్ని అధికారులు కఠినంగా నిషేధించినప్పటికీ, కొందరు ఆ ఆంక్షలను లెక్కచేయకుండా అలాలు చేస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పవిత్రమైన వనదేవతల క్షేత్రంలో ఇలాంటి ప్రవర్తన అనుచితమని భక్తులు మండిపడుతున్నారు. జాతర అనగానే భక్తి, విశ్వాసం, సంప్రదాయం ప్రధానంగా ఉండాల్సిన చోట, కొందరి బాధ్యతారాహిత్యం మేడారం ఆత్మను దెబ్బతీస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కుటుంబాలతో, మహిళలతో వచ్చే భక్తులకు ఈ పరిణామాలు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొందరి తప్పుదారి..!
మేడారం జాతరలో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం అమ్మవార్లకు మొక్కులుగా కోడి, మేక, గొర్రెలను సమర్పించడం ఆనవాయితీ. ఇవన్నీ విశ్వాసంతో కూడిన ఆచారాలుగా తరతరాలుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ పవిత్ర సందర్భంలో మద్యం సేవించడం సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధమని భక్తులు స్పష్టం చేస్తున్నారు. అలాలు చేయడం వల్ల శాంతిభద్రతలకు భంగం కలిగే ప్రమాదం ఉందని, జాతర వాతావరణం అపవిత్రమవుతోందని వారు ఆందోళన చెందుతున్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. జాతర ప్రాంగణంలో నిరంతర పోలీస్ గస్తీ, మద్యం విక్రయాలపై కఠిన నిఘా, అలాలు చేస్తున్న వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. మేడారం మహాజాతర ఒక ఉత్సవం మాత్రమే కాదు.. అది ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలకు ప్రతీక. ఇలాంటి పవిత్ర జాతరలో అనుచిత ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు, భక్తులు, స్థానికులు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నారు. పవిత్రతను కాపాడితేనే మేడారం మహాజాతర అసలైన ఆత్మ నిలుస్తుందన్నది భక్తుల ఆకాంక్ష.


