కేసీఆర్‌కు నోటీసులు
నందినగర్ నివాసానికి సిట్ బృందం
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం
రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ
65 ఏండ్లు దాటినందున కోరిన చోటే విచారణ
ఇప్పటికే కేటీఆర్, హరీష్, సంతోష్‌రావుల విచారణ
మండిపడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు ఇచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా క్షేత్రస్థాయిలో ఆధారాలను సేకరించిన సిట్ అధికారులు.. నేరుగా కేసీఆర్‌ను విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన పీఏకు నోటీసులు అందజేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 65 ఏళ్లు పైబడిన దృష్ట్యా కేసీఆర్‌కు విచారణ సమయంలో స్టేషన్ హాజరు ప్రత్యేక మినహాయింపునిచ్చారు. జూబ్లీహిల్స్ స్టేషన్‌కు రావొచ్చు లేదంటే.. హైదరాబాద్‌లోని మరో ప్రాంతాన్ని సూచించవచ్చునని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ అగ్రనేతలను సిట్ విచారించింది. మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావును అధికారులు ప్రశ్నించారు. వీరి నుంచి సేకరించిన వివరాలు, అలాగే ప్రస్తుతం జైలులో ఉన్న పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్‌ను విచారించాల్సిన అవసరం ఉందని సిట్ భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల వినియోగం, రాజకీయ నేతల ఫోన్ల నిఘాపై ప్రధానంగా ఈ విచారణ సాగనున్నట్లు తెలిసింది.
దర్యాప్తు వేగవంతం
రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేయగా, ప్రభాకర్ రావును సైతం పలుమార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఈ కేసులో చిన్న చిన్న గ్యాప్స్‌ను కూడా ఫిల్ చేస్తూ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ముందుకు వెళ్తోంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ కస్టోడియల్ విచారణ ఆధారంగా కీలక సమాచారాన్ని సేకరించింది. ఇప్పటికే ట్యాపింగ్ బాధితులుగా ఉన్న మొత్తం 618 మందిని దాదాపు అందరి స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన సిట్ అధికారులు, ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ తర్వాత మరికొంతమందిని పిలిచి విచారిస్తున్నారు.
ఎస్ఐబీ ఏఎస్పీ ఇచ్చిన ఫిర్యాదుతో
2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు అనేక కీలక మలుపులు తిరుగుతూ, అక్రమ నిఘాకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలను వెలుగులోకి తెచ్చింది. వీసీ సజ్జనార్ నాయకత్వంలో మరో సిట్ ఏర్పాటు చేసిన తర్వాత దర్యాప్తు మరింత వేగవంతమైంది. దీని తర్వాత సిట్ ఇటీవల ఎమ్మెల్సీ నవీన్ రావు, మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌లను విచారించింది. వారి వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు, విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీశారు. అనేక వాంగ్మూలాల్లో కేసీఆర్ పేరు వెలుగులోకి రావడంతో, ఇప్పుడు ఆయనకు నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పాత్ర గురించి ప్రస్తావించినట్లు ఆరోపణలు వచ్చాయి. భుజంగ రావు కూడా ప్రభాకర్ రావు నియామకం గురించి ప్రస్తావిస్తూ కేసీఆర్ పేరు చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో పాలుపంచుకున్న సీనియర్ అధికారులు సంబంధిత కాలంలో మాజీ ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌ను తరచుగా సందర్శించారని భుజంగ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ వాంగ్మూలాలు, వాటికి మద్దతుగా లభించిన ఆధారాల ఆధారంగా సిట్ తన దర్యాప్తును ముందుకు తీసుకెళ్తుందని భావిస్తున్నారు. కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడంతో దర్యాప్తు కీలక దశలోకి ప్రవేశించింది. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
ఇటీవలే కేటీఆర్‌ను లోతుగా విచారించిన సిట్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్‌ను ఇటీవల ప్రత్యేక దర్యాప్తు బృందం లోతుగా విచారించింది. ఆయనను పలు అంశాలపై అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్లు, విరాళాలు సమకూర్చిన వారిలో పలువురు వ్యాపారుల మొబైల్స్ నిఘాలో ఉన్నట్లుగా సిట్‌కు ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లుగా తెలిసింది. ఆయా ఫోన్ నెంబర్లతో ఉన్న జాబితాను కేటీఆర్ ముందు ఉంచి విచారించినట్లు సమాచారం. అలాగే ఫోన్ ట్యాపింగ్ ద్వారా తమను బెదిరించి బీఆర్ఎస్కు ఎలక్ట్రోరల్ బాండ్లు సమకూర్చే విధంగా చేశారంటూ కొంతమంది వ్యాపారులు ఇచ్చిన ఫిర్యాదులపై ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. వ్యాపారులు తమకు స్వచ్ఛందంగానే విరాళాలను ఇచ్చారని చెప్పినట్లు సమాచారం.


