మేడారం జనసంద్రం
రెండో రోజూ జాతరకు పోటెత్తిన భక్త జనం
లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు
పుణ్యస్నానాలతో జనసంద్రంగా జంపన్నవాగు
శివసత్తుల పూనకాలతో మార్మోగుతున్న వనం
విందు..వినోదాలతో సేదతీరుతున్న భక్తులు
అలారారుతున్న ఆదివాసీ,గిరిజన ఆధ్యాత్మిక సంస్కృతి
జాతర సమాహారంపై కాకతీయ ప్రత్యేక చిత్రమాలిక
కాకతీయ, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర రెండో రోజూ జనసంద్రంగా మారింది. వనదేవతల దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. జాతర ప్రాంగణం, గద్దెల ప్రాంతం, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే దర్శనాల కోసం భక్తుల రాక కొనసాగడంతో మేడారం పరిసరాలన్నీ పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. జాతరలో భాగంగా జంపన్నవాగులో పుణ్యస్నానాలకు భక్తులు పెద్దఎత్తున చేరుకున్నారు. వాగు వద్ద భక్తుల గుంపులు కనిపించగా, స్నానాలతో జంపన్నవాగు పరిసరాలు జనసంద్రంగా మారాయి. సంప్రదాయ నమ్మకాలతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలోకి వెళ్లారు.







శివసత్తుల పూనకాలు.. విందు వినోదాలు..
వనం శివసత్తుల పూనకాలతో మార్మోగింది. డోలు, తుడుందెబ్బల మోతలు, కొమ్ముబూరల నాదాలతో అడవంతా మారుమోగుతోంది. పూనకాలలో భక్తులు అమ్మవార్ల నామస్మరణతో ఉయ్యాలలూగుతూ జాతర ఉత్సాహాన్ని మరింత పెంచారు. దారి పొడవునా ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. దర్శనాల మధ్య భక్తులు విందు–వినోదాలతో సేదతీరుతున్నారు. కుటుంబాలుగా వచ్చిన భక్తులు జాతర ప్రాంగణంలో విశ్రాంతి తీసుకుంటూ, సంప్రదాయ వంటకాలను ఆస్వాదిస్తున్నారు. చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా జాతర ఉత్సవ వాతావరణంలో మమేకమయ్యారు.






అలారారుతున్న ఆదివాసీ,గిరిజన ఆధ్యాత్మిక సంస్కృతి
మేడారం జాతరలో ఆదివాసీ–గిరిజన ఆధ్యాత్మిక సంస్కృతి అద్భుతంగా అలరారుతోంది. సంప్రదాయాలు, ఆచారాలు, నృత్యాలు, పూజావిధానాలతో జాతర ప్రత్యేకతను చాటుతోంది. రెండో రోజు కూడా భక్తుల తాకిడితో మేడారం మహాజాతర ఉత్సాహంగా సాగుతోంది.







