- మంత్రి సీతక్క ఆదేశాలతో రంగంలోకి ఉన్నతాధికారులు
- బాధితురాలి తల్లితో మాట్లాడిన శిశు సంక్షేమ శాఖ జేడీ మోతి
- రాత్రికి రాత్రి అంగన్వాడి కేంద్రం తరలింపు
కాకతీయ, నర్సంపేట : నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా మంత్రి సీతక్క ఆదేశించడంతో మంగళవారం ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గ్రామాన్ని మంగళవారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ మోతి మరియు వరంగల్ రీజనల్ జాయిన్ డైరెక్టర్ ఝాన్సీ, డిడబ్ల్యుఓ రాజమణి, డీటీఓ సౌజన్యలు, సీడీపీవో మధురిమ, డీసీ ఉమ, సూపర్ వైజర్ మాధవిలు బాధితురాలిని నర్సంపేట లో ఉన్న జిల్లా ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం ఖానాపురం మండలంలో అంగన్వాడీ ఉన్న గ్రామాన్ని సందర్శించారు. బాధితురాలైన చిన్నారి తల్లిని వివరాల అడిగి తెలుసుకున్నారు. పోలీసుల సమక్షంలో నర్సంపేటలో ఉన్న జిల్లా ఆస్పత్రికి బాధితురాలిని తీసుకువచ్చి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం హనుమకొండ ల్యాబ్ కు పంపించారు.
రాత్రికి రాత్రే అంగన్వాడీ కేంద్రం తరలింపు

అత్యాచార ఘటన వెలుగులోకి రావడంతో భయభ్రాంతులకు గురైన అంగన్వాడీ కార్యకర్త ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ వేరే చోటికి రాతి రాత్రే మార్చేసింది. ఇట్టి విషయం విచారణ అధికారులు వచ్చేంతవరకు వెలుగు చూడకపోవడం గమనార్హం. దీంతోపాటుగా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పరదాలు కూడా తొలగించడంతో ఉన్నతాధికారులు అంగన్వాడీ కార్యకర్తపై అగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రం తరలించేటప్పుడు అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని అంగన్వాడీ కార్యకర్తపై మండిపడ్డారు. అత్యాచార విషయం ఆ నోట ఈ నోట బయటికి పోక్కడంతో దీన్ని కప్పిపుచ్చుకునేందుకు అంగన్వాడీ కార్యకర్త తన కుమారుడిని కాపాడుకోవడం కోసం సాక్షాలు లేకుండా చేయడానికి అంగన్వాడి కేంద్రాన్ని మరో చోటుకు తరలించిందని గ్రామస్తుల్లో చర్చ జోరుగా సాగుతుంది.
ఆరోగ్య ఖర్చులు నిమిత్తం రూ.25 వేల ఆర్థిక సహాయం

బాధిత చిన్నారి ఆరోగ్య అవసరాల రీత్య తక్షణ సహాయం కింద స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.25వేలు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ మోతి బాధితురాలు తల్లికి అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఇది ఘటనకు పాల్పడిన వారిపై మెడికల్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అంగన్వాడీ కార్యకర్తపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు.


