15కల్లా బిల్లులు ఇవ్వండి! జీడబ్ల్యూఎంసీ కాంట్రాక్టర్ల విజ్ఞప్తి
15వ తర్వాత సమ్మె చేస్తామని హెచ్చరిక
కాకతీయ, వరంగల్: వరంగల్ మహానగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల బిల్లులను ఈ నెల 15వ తేదీలోగా చెల్లించాలని జీడబ్ల్యూఎంసి పరిధిలోని హనుమకొండ, వరంగల్ సివిల్ కాంట్రాక్టర్లు బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ని కోరారు. ఈ మేరకు ఆమెకు వినతిపత్రం సమర్పించారు. 15వ తేదీలోగా బిల్లులు చెల్లించుకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని వినతిపత్రంలో హెచ్చరించారు. నాలుగు దశాబ్దాలుగా నగరాభివృద్ధిలో సుమారు 400 మంది చిన్న, మధ్య తరగతి కాంట్రాక్టర్లు పాలుపంచుకుంటున్నట్లు తెలిపారు. తద్వారా 10వేల మంది లేబర్ కుటుంబాలకు జీవనోపాధి కలుగుతున్నదని పేర్కొన్నారు. ఎనిమిది నెలలుగా తాము చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని వాపోయారు. బిల్లులు రాకపోవడంతో తామే కాకుండా తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. తమ పరిస్థితిని అర్ధం చేసుకుని తక్షణమే బిల్లులు చెల్లించేందుకు చొరవ చూపాలని కమిషనర్ ను కోరారు.


