హుస్నాబాద్ మార్కెట్‌కు నిధులు
యార్డుకు ‘అభివృద్ధికి మంత్రి పొన్నం చొరవ
రూ.8.05 కోట్లకు పరిపాలన అనుమతులు
గోడౌన్లు, షెడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి చర్యలు
మంత్రి పొన్నం కృషికి ఫలితం
రైతులు–మార్కెట్ వర్గాల్లో హర్షం
కాకతీయ, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డు అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ.805.50 లక్షలకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులు మార్కెట్ మౌలిక సదుపాయాల బలోపేతానికి కీలకంగా మారనున్నాయి. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో గోడౌన్లు, కవర్డ్ షెడ్లు, లోతట్టు ప్రాంతాల్లో ఉపరితల సీసీ పనుల కోసం రూ.335 లక్షలు మంజూరు చేశారు. రైతులు తమ పంటలను నిల్వ చేసుకునేలా గోడౌన్లు, వర్షం నుంచి రక్షణ కలిగించే షెడ్ల నిర్మాణం జరగనుంది.

డ్రెయిన్లు–కాంపౌండ్ వాల్‌కు నిధులు
మార్కెట్ యార్డులో మిగిలిన భాగంలో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.25 లక్షలు కేటాయించారు. అంతేకాకుండా యార్డు అంతర్గత ప్రాంతాల్లో డ్రెయినేజీ సమస్యలను పరిష్కరించేందుకు కాంపౌండ్ వాల్, ఇంటర్నల్ బాక్స్ డ్రెయిన్ వెంబడి ఓపెన్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.400 లక్షలు మంజూరు చేశారు. దీంతో వర్షాకాలంలో నీరు నిలవకుండా సౌకర్యం కలగనుంది. మార్కెట్ యార్డులో విద్యుదీకరణ పనుల కోసం రూ.26 లక్షలు కేటాయించారు. అలాగే గోడౌన్లకు షెడ్లు, పీవీసీ గట్టర్లు, డౌన్ స్పౌట్లు కవర్ చేయడానికి ఎంఎస్ గట్టర్లు ఏర్పాటు చేయడానికి రూ.19.50 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులన్నీ పూర్తయితే మార్కెట్ యార్డు రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి.
మంత్రి పొన్నం కృషికి కృతజ్ఞతలు
హుస్నాబాద్ మార్కెట్ యార్డు అభివృద్ధికి భారీ నిధులు కేటాయించడంలో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఫలించిందని రైతులు, మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ.8.05 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు రైతులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ అభివృద్ధితో హుస్నాబాద్ మార్కెట్ యార్డు రైతులకు మరింత అనుకూలంగా మారనుంది.


