వనం నుంచి జనంలోకి సమ్మక్క.. మేడారంలో కీలక ఘట్టం
కాకతీయ, మేడారం బృందం : మేడారం మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవత సమ్మక్క తల్లి వనం విడిచి భక్తజనంలోకి అడుగుపెట్టిన క్షణం మేడారం అడవులు భక్తి పారవశ్యంతో మారుమోగాయి. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి ఆగమనం ప్రారంభమవడంతో లక్షలాది భక్తులు ఉత్కంఠగా ఎదురుచూసిన అపూర్వ ఘడియ సాకారమైంది. చిలకలగుట్టపై సంప్రదాయ పూజలు పూర్తైన అనంతరం, పూజారులు సమ్మక్క తల్లి కుంకుమ భరిణెను తీసుకుని మేడారం గద్దెల దిశగా ప్రయాణం ప్రారంభించారు. ఈ సమయంలో భద్రతా ఏర్పాట్ల నడుమ ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతకు అధికారిక స్వాగతం పలికారు. ఈ లాంఛనాలు భక్తుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.

జయజయధ్వానాలు.. పూనకాలతో మార్మోగిన అడవి
సమ్మక్క తల్లి కుంకుమ భరిణె జనంలోకి రాగానే “జయ జయ సమ్మక్క” అంటూ భక్తుల జయజయధ్వానాలు మేడారం అడవులన్నీ మారుమోగించాయి. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, కొమ్ము బూరల నాదాలతో పరిసర ప్రాంతాలు దివ్య ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అడుగడుగునా భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. సమ్మక్క తల్లి దర్శనంతో తమ మొక్కులు తీరుతాయని, కష్టాలు తొలగిపోతాయని భక్తులు అపార విశ్వాసంతో ఎదురు చూశారు. లక్షలాది మంది భక్తులు అమ్మవారికి బంగారంగా భావించే బెల్లం సమర్పించుకునేందుకు సిద్ధమయ్యారు. వనదేవత ఆగమనంతో మేడారం జనసంద్రంగా మారింది.
మరి కొద్ది సేపట్లో గద్దెపైకి సమ్మక్క
రాత్రి 8:30 గంటల తర్వాత సమ్మక్క తల్లి గద్దెపైకి రానుండటంతో భక్తుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. గద్దె వద్దకు చేరే ఆ మహాక్షణాన్ని కళ్లారా చూడాలని భక్తజనం శాంతంగా ఎదురుచూస్తోంది. సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరగానే మేడారం మహా జాతర లాంఛనంగా పరాకాష్టకు చేరనుంది. ఈ అపూర్వ దృశ్యాలు మేడారంలో భక్తులకు గూస్‌బమ్స్ తెప్పిస్తూ, సమ్మక్క–సారలమ్మ మహా జాతర ఆధ్యాత్మిక మహిమను మరోసారి చాటుతున్నాయి.


