క్యూలైన్లలో భక్తుల కష్టాలు..
దర్శనానికి గంటల తరబడి నిరీక్షణ
తాగునీరు, నీడ లేక ఇబ్బందులు
అందిన కాడికి దండుకుంటున్న ప్రైవేటు వాటర్ వ్యాపారులు
కాకతీయ, మేడారం బృందం : మేడారం మహాజాతర సందర్భంగా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించినప్పటికీ, భక్తులు మాత్రం క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు, పార్కింగ్‌లు, క్యూ లైన్లు, ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేసినా… ప్రత్యక్షంగా భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల విషయంలో లోపాలున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమ్మవార్ల దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు పొడవైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అయితే దర్శనం కోసం గంటల తరబడి నిల్చోవాల్సి రావడంతో భక్తులు అలసటకు గురవుతున్నారు. మధ్యలో విశ్రాంతి తీసుకునే అవకాశం లేకపోవడం వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భక్తులు వాపోతున్నారు.

తాగునీటి సదుపాయం కొరవడి
క్యూ లైన్లలో తాగునీటి సదుపాయం సరిపడా లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. ఉచితంగా తాగునీరు అందించాల్సిన చోట చాలా ప్రాంతాల్లో నీటి ట్యాంకులు, సరఫరా పాయింట్లు కనిపించడంలేదని భక్తులు చెబుతున్నారు. ఎండలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడంతో నీటి అవసరం ఎక్కువగా ఉండగా, అందుకు తగిన ఏర్పాట్లు లేకపోవడం ఆవేదన కలిగిస్తోంది. మరోవైపు క్యూ లైన్ల పరిసర ప్రాంతాల్లో తాగునీరు, కూల్‌డ్రింక్స్ విక్రయాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉచిత సదుపాయాలు లేకపోవడంతో భక్తులు తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరలకు బాటిల్డ్ వాటర్, శీతల పానీయాలు కొనుగోలు చేయాల్సి వస్తోందని అంటున్నారు. మహాజాతరలో సేవ కంటే వ్యాపారానికే ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అభివృద్ధి పనులు చేశామని చెప్పడమే సరిపోదని, క్యూ లైన్లలో నిల్చునే భక్తులకు తాగునీరు, నీడ, విశ్రాంతి, వైద్య సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని భక్తులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు, సేవా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. మహాజాతర స్థాయికి తగిన విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే భక్తులకు నిజమైన సౌకర్యం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.


