కాకతీయ, కరీంనగర్ బ్యూరో : విశ్వహిందూ పరిషత్ కరీంనగర్ విభాగ గోరక్ష సమావేశం ఆదివారం కరీంనగర్ లోని పరిషత్ కార్యాలయం నిర్వహించారు. ఈ సమావేశానికి విభాగంలోని నాలుగు జిల్లాల నుంచి 20 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. దక్షిణ భారత గోరక్ష ప్రముఖుడు యాదగిరిరావు, తెలంగాణ ప్రాంత గోరక్ష ప్రముఖుడు వెంకన్న, గోరక్ష టీం సభ్యుడు రాధాకృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్ మార్గదర్శనం చేశారు.
ఈ సందర్భంగా యాదగిరిరావు మాట్లాడుతూ గోమాతలో సమస్త విశ్వాన్ని, మానవాళి ఆరోగ్యాన్ని, ప్రకృతిని, భూమిని, పర్యావరణాన్ని కాపాడే శక్తి ఉందని, అలాంటి గోసంతతిని కాపాడుకోవడం అందరి కర్తవ్యమని తెలిపారు. ప్రతి గ్రామంలో గోరక్ష సమితులను ఏర్పాటు చేసి గో ఆధారిత వ్యవసాయం, గో ఉత్పత్తుల తయారీ, పంచగవ్య చికిత్సలు వంటి అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గోమాత ఉత్సవాలు, గోవిజ్ఞాన పరీక్షలు నిర్వహించడంతో పాటు, పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలో గోవిజ్ఞాన కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించారు.


