వి.బి.జి. రామ్ చట్టంపై కాంగ్రెస్ దుష్ప్రచారం
గంగాడి కృష్ణారెడ్డి
కాకతీయ, కరీంనగర్ : ఉపాధి హామీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి, కూలీల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వికసిత భారత్ గ్యారెంటీ – వి.బి.జి. రామ్ జీ–2025’ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడం దారుణమని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. పని దినాలు పెంచడం, గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ చట్టంపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. చట్టంలో ‘రామ్’ అనే పేరు ఉండటమే కారణంగా కాంగ్రెస్ వ్యతిరేకించడం ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. గురువారం మానకొండూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం మానకొండూరులో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కందిరాజి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి, రంగు భాస్కరాచారి, వి.బి.జి. రామ్ జీ జిల్లా కన్వీనర్ కరివేద మహిపాల్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అప్పని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


