పొత్తుతోనే పోటీ
ఎదులాపురంలో మున్సి‘పాలిటిక్స్’
32వార్డుల్లో కేవలం 25 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన మంత్రి
మిగిలిన ఏడింటి నుంచి సీపీఐ అభ్యర్థులకు ఛాన్స్..!?
గడువు సమీపిస్తున్నా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఉత్కంఠ
పొత్తు కుదిరినట్లేనంటూ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు
బీఆర్ఎస్–సీపీఎంల మధ్య పొత్తు పొడించిన వేళ ఆసక్తికర పరిణామం
కాకతీయ, కూసుమంచి : మున్సిపాలిటీ ఎన్నికలకు నగారా మోగడంతో ఎదులాపురం మున్సిపాలిటీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఎదులాపురం మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 25 వార్డులకు అభ్యర్థులను ప్రకటించడంతో పొత్తుల రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. మొత్తం 32 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో మిగిలిన ఏడు వార్డులపై స్పష్టత లేకపోవడంతో—అవి పొత్తులో భాగస్వామి సీపీఐకే కేటాయించబోతున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

25 వార్డుల వెనుక వ్యూహమేంటి?
కాంగ్రెస్ పార్టీ 25 వార్డుల జాబితాను విడుదల చేయగానే, ఇప్పటివరకు పొత్తులో ఉన్న సీపీఐ స్థానం ఏంటన్నది రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, మిగిలిన ఏడు సీట్లు సీపీఐ కోసం వదిలే అవకాశముందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే సీపీఐ మాత్రం ఏడు కాదు—పది నుంచి 12 వార్డులు కోరుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. సీట్ల పంపకాల్లో ఇంకా తుది నిర్ణయం రాకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీ మిగిలిన అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసిందన్న వాదన బలపడుతోంది. సీపీఐ కోరుతున్న మేరకు సీట్లు దక్కకపోతేకాంగ్రెస్‌తో పొత్తు కొనసాగింపుపై ఆ పార్టీ వెనుకడుగు వేసే అవకాశాలు లేకపోలేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితిలో సీపీఐ ఒంటరిగా బరిలో దిగితే నష్టం కాంగ్రెస్‌కే ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పట్టణ పరిధిలో ఓటు చీలిక జరిగితే అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగలవచ్చన్న ఆందోళన కనిపిస్తోంది.
బీఆర్ఎస్–సీపీఎం ఇప్పటికే పొత్తు..
ఇదిలా ఉండగా, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ఇప్పటికే సీపీఎంతో పొత్తు ఖరారు చేసుకుని దూకుడుగా ముందుకెళ్తోంది. గత పంచాయతీ ఎన్నికల్లో రూరల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్–సీపీఎం కూటమి అధికార పార్టీకి షాక్ ఇచ్చిన అనుభవం ఉంది. అదే సమీకరణ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతుందన్న భయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎదులాపురం మున్సిపాలిటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ లెక్కలు కట్టుకుంటూ ముందుకు సాగుతున్నారన్నది అంతర్గత సమాచారం. అందుకే పొత్తుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి—కాంగ్రెస్–సీపీఐ పొత్తు కొనసాగుతుందా? లేక సీట్ల పంచకం కాంగ్రెస్‌కు కొత్త సవాళ్లు తెచ్చిపెడుతుందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ఎదులాపురం మున్సిపాలిటీ ఫలితం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం కావడం ఖాయం.


