మేడారంలో గుప్పుమంటున్న గుడుంబా
రద్దీ ప్రదేశాల్లో జోరుగా నిషేధిత సారా విక్రయాలు
భక్తుల రాకపోకల మధ్యే అక్రమ దందా
అధికారుల పర్యవేక్షణపై తలెత్తుతున్న సందేహాలు
కాకతీయ, మేడారం బృందం : కోట్లాది మంది భక్తులు తరలివచ్చే పవిత్ర మేడారం మహాజాతరలో అక్రమ నాటు సారా వ్యాపారం గుప్పుమంటోంది. జాతర పరిసరాల్లో, ముఖ్యంగా మేడారం గద్దెల నుంచి చిలకగట్టుకు వెళ్లే ప్రధాన మార్గంలో నాటు సారా విక్రయాలు బహిరంగంగానే సాగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో నడిచే రహదారిపైనే ఈ అక్రమ కార్యకలాపాలు కొనసాగుతుండటం తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. భక్తుల రాకపోకల మధ్యే మద్యం విక్రయాలు జరగడం వల్ల గొడవలు, అశాంతి చోటుచేసుకునే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల మద్యం మత్తులో ఉన్నవారు గొడవలకు దిగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవిత్ర జాతర వాతావరణానికి ఇది పూర్తిగా విరుద్ధమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఏదీ..?!
జాతరకు మహిళలు, చిన్నపిల్లలు, కుటుంబాలతో వచ్చే భక్తులు ఈ పరిస్థితులతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. అమ్మవార్ల దర్శనానికి వెళ్లే మార్గంలోనే మద్యం విక్రయాలు జరగడం జాతర పవిత్రతను దెబ్బతీస్తోందని పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతర అనేది ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మహా పర్వమని, ఇలాంటి అక్రమాలకు అక్కడ స్థానం ఉండకూడదని అంటున్నారు. ఈ అంశాన్ని పలువురు భక్తులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ తక్కువగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్, పోలీస్ శాఖలు గట్టి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. నాటు సారా విక్రయాలపై కఠినంగా వ్యవహరించకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశముందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలి
మేడారం మహాజాతర పవిత్రతను కాపాడేందుకు ప్రత్యేక తనిఖీలు, నిరంతర గస్తీ పెంచాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ మద్యం విక్రయాలను వెంటనే అరికట్టాలని, బాధ్యులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పవిత్ర జాతరలో శాంతిభద్రతలు భద్రంగా ఉండాలంటే అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.


