- జ్యోతి వెలిగించి ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్–2025 గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జ్యోతి వెలిగించి క్రీడా సమారంభానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభ పాఠవాలను వెలికితీయడంలో ఇలాంటి క్రీడా పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. జూన్–3 పరిధిలోని సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు చెందిన 12 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ల విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. నవంబర్ 6 నుంచి 8 వరకు జరిగే ఈ స్పోర్ట్స్ మీట్‌లో వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ వంటి విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ప్రిన్సిపాల్ జగన్నాథం, అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


