- ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్
- కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవం
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పేరిట కాంట్రాక్టర్లు మాత్రమే లాభ పడ్డారని, ప్రజలకు ఎలాంటి న్యాయం జరగ లేదని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో నూతన సమీకృత కూరగాయల మార్కెట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలోకూరగాయల మార్కెట్ నిర్మాణానికి కోట్ల రూపాయలు కేటాయిస్తే కేవలం లాభాలు వచ్చే వరకు మాత్రమే కాంట్రాక్టర్లు పనులు చేశారని ఆరోపించారు. మిగిలిన పనులు గాలికి వదిలేసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ముఖ్య మంత్రి రేవంత్ సర్కార్ ఏర్పడ్డాక అదనంగా 90 లక్షల రూపాయల నిధులు కేటాయించి మార్కెట్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. మహబూబాబాద్ ప్రజలకు పండ్లు, కూరగాయలు, మాంసం కోసం సమీకృత మార్కెట్ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, జిల్లా నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


