- పరకాల పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలి
- పట్టణ సుందరీకరణే నా లక్ష్యం..
- ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి.
కాకతీయ, పరకాల: పట్టణంలోని పలు వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరకాల పట్టణం ముంపుకు గురి కాకుండా ప్రణాళికా బద్ధంగా సుందరీకరణ చేస్తామని అన్నారు. టీయూఎఫ్ ఐడీసీ నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అన్నారు. గతంలో వచ్చిన నిధులు నిరుపయోగం అయ్యాయని, గత పాలకులు డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయకుండా నిధులను దుర్వినియోగం చేశారని అన్నారు. పరకాల పట్టణాన్ని ఆరు జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తామన్నారు. నియోజకవర్గకేంద్రంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, టాస్క్, ఇండోర్ స్టేడియం అభివృద్ధి, స్విమ్మింగ్ పూల్, ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్, పీఆర్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు కట్కూరి దేవేందర్ రెడ్డి, కొయ్యడ శ్రీనివాస్, పర్నెం మల్లారెడ్డి, మడికొండ సంపత్ కుమార్, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


