విరాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా..!
డకౌట్ తర్వాత అభివాదానికి కారణం ఏంటీ..?
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : ఇండియన్ క్రికెట్ స్టార్ బ్యాట్స్‌మెన్ కింగ్ కోహ్లి మరోసారి పేలవ ప్రదర్శనను నమోదు చేశారు. ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్‌పై అభిమానులు పెట్టుకున్న అంచనాలు పటపంచాలు చేసేశారు. ఆసీస్‌తో పెర్త్ వన్డేలో 8 బంతులు ఆడిన కోహ్లీ పరుగుల ఖాతా తెరవలేదు. ఇప్పుడు తనకు కలిసొచ్చే అడిలైడ్‌లోనూ డకౌట్ కావడం ఆయన అభిమానుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఆడిలైడ్‌లో కేవలం నాలుగు బంతులను ఎదుర్కొన్న కోహ్లీ ఎల్బీడబ్ల్యూ కావడంతో డ్రెస్సింగ్ రూం బాట పట్టాడు. కోహ్లీ తన వన్డే కెరీర్‌లో ఇలా వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇప్పుడు ఆ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నట్లయింది.
పెర్త్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరిగింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించినా చివరికి ఆసీస్‌నే విజయం వరించింది. ఆ మ్యాచ్‌లో విరాట్ ఆఫ్‌సైడ్ బంతిని కదిలించి వికెట్ ఇచ్చాడు. మిచెల్ స్టార్క్ సంధించిన బంతిని ఆడబోయి బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఫీల్డర్‌కు చిక్కాడు. ఇప్పుడు అడిలైడ్‌లోనూ రాణిస్తాడనుకుంటే ఇక్కడా బ్యాట్ ఎత్తేశాడు. ఈసారి బార్ట్‌లెట్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. కనీసం డీఆర్‌ఎస్ కూడా తీసుకోకపోవడం గమనార్హం. పెవిలియన్‌కు వెళ్తూ అభిమానులకు అభివాదం చేయడంతో కొత్త చర్చ మొదలైంది. ఈ సిరీస్ అనంతరం వన్డేలకూ వీడ్కోలు చెబుతాడా? అనే సందేహం అభిమానుల్లో నెలకొంది.


