- అధ్యక్ష పదవికి 36మంది దరఖాస్తు
- నరేందర్‌రెడ్డి వెలిచాల మధ్య టప్‌ఫైట్!
- డీసీసీ దక్కితే పకడ్బందీ రాజకీయ బాట పడినట్లే..!
- ఇద్దరి ఆలోచన అదే.. పోటాపోటీగా నేతల విశ్వప్రయత్నాలు
- కలివిడిగా ఉంటున్న కాంగ్రెస్ నేతలు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవికి గట్టి పోటీ నెలకొంది. అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు 36 మంది నాయకులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో పలువురు సీనియన్ నేతలతో పాటు యువ నేతలున్నారు. కరీంనగర్ డీసీసీ స్థానాన్ని దక్కించుకునేందుకు సీనియర్ నేత వెలిచాల రాజేందర్ రావు, ప్రముఖ విద్యావేత్త, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందర్ రెడ్డిల మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీని నిలబెట్టడానికి అనుభవంతో పాటు యుక్తి, ఆర్థిక శక్తి అవసరమని పార్టీ అధిష్ఠానం ముఖ్యులు యోచిస్తున్నట్లుగా సమాచారం. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఆయువు పట్టుగా కరీంనగర్ ఉంటూ వస్తోంది. పార్టీ ఎన్ని ఒడిదుడుకులకు లోనైనా.. బలమైన క్యాడర్ పార్టీని నిలబెడుతూ వచ్చింది. పార్టీతో దశాబ్దాల అనుబంధం కలిగి ఉండి.. కొనసాగుతున్న వారు వేల సంఖ్యలో గ్రామ స్థాయ క్యాడర్ ఉండటం పార్టీకి బలమని చెప్పవచ్చు. ఇంత రాజకీయ ప్రాధాన్యం కలిగిన కరీంనగర్ జిల్లా డీసీసీ పగ్గాలను ఎవరికి అప్పగించాలనే దానిపై పార్టీ నాయకత్వం అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
వెలిచాల వర్సెస్ అల్ఫోర్ నరేందర్
కరీంనగర్ జిల్లా డీసీసీ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వెలిచాల రాజేందర్ రావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వూట్కూరి నరేందర్ రెడ్డిలు ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో తమకున్న పలుకుబడి.. పరిచయాలతో డీసీసీని వశం చేసుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వెలిచాల రాజేందర్.. కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా కార్యకర్తల వెంట ఉన్నారనే సానుకూల భావన జిల్లా కాంగ్రెస్ క్యాడర్‌లో ఉంది. ఇక పార్టీకి భవిష్యత్ లీడర్‌గా.. కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక శక్తి.. యుక్తిలతో ముందుకు నడిపించే సత్తా నరేందర్‌రెడ్డి ఉందని కూడా నేతలు, క్యాడర్ గుర్తు చేస్తుండటం గమనార్హం. నరేందర్ రెడ్డి అధునాతన విద్యా సంస్థల అధినేతగా, విద్యారంగ సేవలతో గుర్తింపు పొందారు. ఇక కరీంనగర్ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఈ పరిణామాం కలిస వస్తుందన్న అంచనాలున్నాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబులతో ఉన్న సత్సంబంధాలు కూడా దోహదం చేయవచ్చన్న విశ్లేషణ జరుగుతోంది.
ఢీసీసీ… హాట్ సీటు..
కాంగ్రెస్ పార్టీలో కొత్త క్యాడర్…పాత క్యాడర్ అంటూ చీలిక కనిపిస్తోంది. కాంగ్రెస్ అంటేనే.. పార్టీ జెండాతో పాటు.. సొంత ఎజెండా కలిగి ఉండే నేతలే అధికంగా ఉంటారు. కలివిడిగా ఉండటం.. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉండటం వంటి లక్షణాలతో ఉండే కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్ష పదవికి నాయకత్వం వహించడం కూడా అంత సులువు కాదన్నది నిజం. ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత.. క్యాడర్ కాపాడుకుంటూనే అసమ్మతి చెలరేగకుండా చూడటం.. ఎమ్మెల్యేలతో సమన్వయం చేయడం వంటి విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవీ బాధ్యతలు కొంతమంది అవకాశంగా భావించి దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతుండగా.. కొంతమంది సీనియర్లు మాత్రం నామ్ కే వాస్తేగా.. దరఖాస్తు చేసి.. ఇది ఇవ్వనందుకు గాను.. నామినేటెడ్ పదవి ఇవ్వాలనే డిమాండ్‌ను లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది.


