- మరుగుదొడ్లు, బస్ షెల్టర్ల నిర్మాణాలకు రూ.20 లక్షలు మంజూరు
- సుజాతనగర్ కేంద్రంలో చేపట్టనున్న నిర్మాణాలు
- త్వరగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం
- ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కాకతీయ, కొత్తగూడెం రూరల్: కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజలకు కావాల్సిన కనీస మౌలికవసతుల కల్పనపై కొత్తగూడెం శాసనసభ సభ్యుడు కూనంనేని సాంబశివరావు ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ పథకాల్లో మంజూరైన నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతుండగా అనేక అభివృద్ధిపనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా సుజాతనగర్ మండల కేంద్రంలో మరుగుదొడ్లు, బస్ షెల్టర్, వేపలగడ్డలో మరో బస్ షెల్టర్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ సుజాతనగర్ మండల కేంద్రంలో ప్రజల సౌకర్యార్ధం మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.10లక్షలు, సుజాతనగర్ మండల కేంద్రం, వేపలగడ్డ గ్రామ సెంటర్లో బస్ షెల్టర్ల నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.


