- ఉగ్రవాదాన్ని ఆపకపోతే పతనం తప్పదు
- ప్రతిసారి సంయమనంతో ఉండలేం..
- దాయాది దేశానికి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్
కాకతీయ, నేషనల్ డెస్క్ : ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చారు. భారత్‌లో ఉగ్రవాదాన్ని స్పానర్స్ చేసే చర్యలను పాక్ మానుకోకుంటే ఆ దేశం ప్రపంచపటం నుంచి కనుమరుగవుతుందని హెచ్చరించారు. భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ లో చూపించిన సంయమనాన్ని ప్రతిసారీ చూపించలేవని అన్నారు. ఈసారి నిర్ణయాత్మక, అత్యంత శక్తివంతమైన సమాధానం ఇస్తుందని గట్టిగ హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ 1.0లో చూపిన సంయమనాన్ని ఈసారి చూపించం. ప్రపంచ పటం ఉండాలనుకుంటోందో, లేదో తేల్చుకునేలా ఈసారి పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఉంటుంది. ప్రపంచ పటంలో పాక్ ఉండదలిస్తే మాత్రం ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడం ఆపితీరాలి’ అని జనరల్ ద్వివేది అన్నారు.
బికనీర్ మిలట్రీ స్టేషన్లో పర్యటన
బికనీర్ మిలట్రీ స్టేషన్‌తో సహా పలు ఫార్వార్డ్ ఏరియాల్లో శుక్రవారం ఉపేంద్ర ద్వివేది పర్యటించారు. బలగాల సన్నద్ధతను అంచనా వేసేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. మిలట్రీ సీనియర్ అధికారులు, వెటరన్స్, సివిల్ డిగ్నటరీలతో ఆయన సమావేశం అయ్యారు. ఆధునికీకరణ, యుద్ధ సన్నాహకాలు, అడ్వాన్సింగ్ టెక్నలాజికల్ సామర్థ్యాలు, ఆపరేషనల్ ఎక్స్‌లెన్స్‌కు ఆర్మీ కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.


