- జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్
కాకతీయ, కొత్తగూడెం రూరల్: జిల్లావ్యాప్తంగా పత్తి కొనుగోలు పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక, రవాణా పోలీస్ శాఖలతో పత్తి కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా పత్తి కొనుగోలు పూర్తిస్థాయిలో పారదర్శకంగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వ విధానాల ప్రకారం మద్దతు ధర పొందేలా, ప్రతీ అధికారి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో 1,72,937 ఎకరాలలో పత్తి పంట సాగు జరిగిందని, 26 లక్షల 56,14 0 క్వింటాళ్ల పత్తి దిగుబడి కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని తెలిపారు. 2025-26 గాను పత్తికి మద్దతు ధర రూ.8110 ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. పత్తి కొనుగోలు చేపట్టడానికి గాను సీసీఐ క్రింద ఆరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వే బ్రిడ్జిలను తనిఖీ చేయాలని తూనికలు కొలతల శాఖల అధికారులను ఆదేశించారు. రైతుల తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో తీసుకువచ్చి మధ్యవర్తులు, అక్రమంగా పత్తి కొనుగోలు చేసి వారి ప్రభావానికి లోను కాకూడదని కలెక్టర్ సూచించారు.
పత్తి మిల్లుల వద్ద ఎటువంటి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పత్తి దిగుబడి అనంతరం పత్తి కట్టెను బయోచార్ తయారీ ఉపయోగించే విధంగా రైతులలో అవగాహన తీసుకురావాలని మిల్లర్లకు కలెక్టర్ సూచించారు. సమావేశంలో సిపిఓ సంజీవరావు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మార్కెటింగ్ శాఖ అధికారి నరేందర్, తూనికలు కొలతలు శాఖాధికారి మనోహర్, రవాణా శాఖ అధికారి వెంకటరమణ, ఇతర అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు.


