కాకతీయ, కరీంనగర్ బ్యూరో : బధిర విద్యార్థుల్లో మంచి ప్రతిభ ఉందని, వారికి చేయూతనిస్తూ మరిన్ని నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా యంత్రాంగం, అక్షయ ఆకృతి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియన్ సైన్ లాంగ్వేజీపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆసక్తి గల ఇతర వర్గాల వారికి రెండవ దశ శిక్షణ కార్యక్రమం ముగిసింది.
కోర్స్ పూర్తి చేసుకున్న వారికి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం సర్టిఫికెట్టు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడారు. బధిర విద్యార్థుల్లో ఇప్పటికే చేతి కళల్లో గొప్ప ప్రతిభ ఉందన్నారు. అంధుల పాఠశాల విద్యార్థులు ఆలపిస్తున్న గేయాల చిత్రికరణలో బధిర విద్యార్థులు కూడా పాల్గొని సైన్ లాంగ్వేజిలో వారు కూడా పాడేందుకు అవసరమైన శిక్షణ, అవకాశం ఇవ్వాలన్నారు.
ఈ సందర్భంగా ట్రైన్ లాంగ్వేజ్ శిక్షణ ఇస్తున్న అక్షయ్ ఆకృతి ఫౌండేషన్ ఇన్స్ట్రక్టర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయి, ప్రాంతీయ శిక్షణ కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ రాంబాబు, బధిరుల పాఠశాల ప్రిన్సిపాల్ కమల, అక్షయ ఆకృతి ఇన్స్ట్రక్టర్లు శైలజ, ధరణి, పర్సిస్, మణి పాల్గొన్నారు.


