కాకతీయ, సూర్యపేట: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పంచాయతీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సోమిరెడ్డి అనే యువకుడు గత నాలుగు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.
రైలు కింద పడి జీవితాన్ని ముగించుకున్న సోమిరెడ్డి ఒక సూసైడ్ నోట్ రాశారు. అందులో, “నాకు ప్రతి నెల జీతం వచ్చుంటే ఇలాంటి పరిస్థితి రాదు. ఆర్థిక సమస్యల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మీ అందరితో కలిసి ఇంకా పనిచేయాలని ఉంది కానీ పరిస్థితులు అలా అనుమతించలేదు” అని పేర్కొన్నారు.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. సహోద్యోగులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు ఆలస్యమవడం వల్ల ఒక కుటుంబం ఇంతటి దుస్థితికి చేరుకోవడం చాలా బాధాకరమని ప్రజలు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సోమిరెడ్డి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జీతాల చెల్లింపులో పారదర్శకత, సమయపాలన పాటించాలంటూ స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటన మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల్లో వేతనాల ఆలస్యాలు ఎంతటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయో చూపించింది. సమాజంలో ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


