కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో నకిలీ వైద్యులపై అధికారులు గట్టి నిఘా పెట్టి, చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) రిజిస్ట్రార్ డా. డి. లాలయ్య కుమార్ ఫిర్యాదు మేరకు ఇంతేజర్‌గంజ్, కాకతీయ యూనివర్సిటీ ఎక్స్ రోడ్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఎఫ్‌ఐఆర్ నంబర్లు 357/2025, 507/2025 కింద మామిడి ఈశ్వరయ్య, సి. హెచ్. వెంకట్ రెడ్డిలపై నకిలీ వైద్యం చేస్తున్నారని ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. కాశిబుగ్గ, గోపాల్‌పూర్ ప్రాంతాల్లో వీరు ఎటువంటి వైద్య అర్హతలు లేకుండా డాక్టర్లుగా మారి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
తాజా తనిఖీల్లో ఈ నకిలీ వైద్యులు అవసరం లేని సందర్భాల్లో అధిక మోతాదులో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ వాడుతూ, ప్రభుత్వ అనుమతి లేకుండా బెడ్స్ ఏర్పాటు చేసి చిన్న హాస్పిటల్స్ లాగా నడుపుతున్నట్లు బయటపడింది. ప్రజారోగ్యానికి హాని కలిగించే ఈ చర్యలు అత్యంత ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. గోపాల్‌పూర్‌లో సాధుల్లా మెడికల్‌కు చెందిన అబ్దుల్ షరీఫ్ అనే వ్యక్తి కూడా నకిలీ వైద్యుడిగా బయటపడ్డాడు. అయితే ఆయన ఇకపై వైద్యం చేయనని అఫిడవిట్ ఇచ్చినందున కేసు నమోదు చేయలేదు. కానీ ఇలాంటి వారిపై విజిలెన్స్ అధికారులు తరచూ నిఘా ఉంచుతారని వెల్లడించారు.
TGMC అధికారులు స్పష్టం చేసిన విషయమేమిటంటే, RMP, PMP లకు అల్లోపతి వైద్యం చేసే అర్హత అసలు లేదని. ఇంజెక్షన్లు వేయడం, సెలైన్ పెట్టడం, ల్యాబ్ టెస్టులు నిర్వహించడం, బెడ్స్ ఏర్పాటు చేయడం వీరి పరిధిలోకి రావని హెచ్చరించారు. అర్హత లేని వైద్యులు చేసే చికిత్సల వల్ల ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని, ఇటీవల అక్కంపల్లి గ్రామంలో మార్కండేయ అనే నకిలీ వైద్యుడు చేసిన తప్పు చికిత్స కారణంగా 25 ఏళ్ల యువకుడు మృతి చెందిన సంఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు.
పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా. వి.నరేష్ కుమార్ మాట్లాడుతూ, అర్హత లేకుండా వైద్యం చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. చట్టం ప్రకారం నకిలీ వైద్యులపై రూ.5 లక్షల వరకు జరిమానా మరియు కనీసం ఒక సంవత్సరం నుంచి గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, అర్హతలేని వ్యక్తుల దగ్గర చికిత్స చేయించుకోవద్దని, నకిలీ డాక్టర్లను గుర్తించి ఫిర్యాదు చేయాలని సూచించారు.


