కాకతీయ, పరకాల : 1947లో రజాకార్ల కాల్పుల్లో అమరులైన త్యాగ వీరులను స్మరించుకుంటూ, మంగళవారం పరకాల అమరధామం,లో బిజెపి రాష్ట్ర నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ, ఊచకోతలో అమరులైన వీరుల త్యాగం తెలంగాణ విమోచన చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛను తీసుకొచ్చింది అమరుల త్యాగమేనని, వీరుల స్ఫూర్తి భవిష్యత్ తరాలకి మార్గదర్శకమని అన్నారు. అమరుల స్మారక స్థలాన్ని అభివృద్ధి చేసి, యువతకు చరిత్రను తెలియజేయడానికి మరింత కృషి అవసరమని సూచించారు. స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ సాధించిన ఈ విముక్తి పోరాటాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
పరకాల ఊచకోతలో ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగం శాశ్వతంగా నిలుస్తుందని రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, పెసరు విజయ్ చందర్ రెడ్డి, కాచం గురు ప్రసాద్, గుజ్జ సత్యనారాయణ, అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్, రూరల్ మండలం అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్, దేవునూరి మేఘనాథ్, సండ్ర మధు, ఎర్రం రామన్న, సంఘ పురుషోత్తం, స్థానిక నాయకులు మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.


