కాకతీయ, నర్సంపేట: రాష్ట్రంలో రైతాంగం అష్ట కష్టాలు పడుతుంటే వాటిని తీర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలను నిర్వహిస్తుంది. యూరియా అందక అరిగోస పడుతున్న రైతుల పక్షాన ఖానాపురం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. నర్సంపేట నియోజకవర్గంలో యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం రైతులకి భరోసానిచ్చే స్థితిలో స్థానిక ఎమ్మెల్యే లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శమని విమర్శించారు.
రైతు సోదరులు స్కూల్లో కి వెళ్లే తమ పిల్లలను సైతం తెల్లవారుజామునే యూరియా కోసం పస్తులతో లైన్లో నిలబెట్టడం చూస్తుండడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి సిగ్గుచేటు అన్నారు. రైతులు పండించిన వడ్లకు ప్రభుత్వం బాకీ ఉన్న బోనస్ డబ్బులు చెల్లించిన తర్వాతే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలలో రైతులను ఓట్లు అడగాలని, ముందుగా నర్సంపేట నియోజకవర్గం లో 11600 మంది రైతులకు చెల్లించాల్సిన 26 కోట్ల 60 లక్షల రూపాయల తక్షణమే రైతులకు చెల్లించాలన్నారు.
సన్న, చిన్నకారు రైతులు రోజువారీ కూలీ పనులను వదిలిపెట్టి యూరియా కోసం రైతు వేదికల చుట్టూ, సొసైటీ గోదాంల చుట్టూ పరుగులు పెట్టాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిందని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


