కాకతీయ, నేషనల్ డెస్క్: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వాగులు, వంకలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్, చమోలీ జల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షం పలు గ్రామాలను అతలాకుతలం చేస్తోంది. ఉత్తరాఖండ్ లో తాజాగా మరోసారి క్లౌడ్ బరస్ సంభవించింది. ఈ విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
పలు చోట్ల ఇళ్లు కూలడంతో పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకున్నారు. మోపాటా ప్రాంతంలో భారీ వరదల్లో ఇద్దరు కొట్టుకుపోయారు. పశువుల కొట్టం కూలడంతో దాదాపు 20 పశువులు జలసమాధి అయ్యాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా రుద్రప్రయాగ్ లోని అలకనంద, మందాకిని నదుల నీటి మట్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రుద్రప్రయాగ్ లోని హనుమాన్ ఆలయం వరద నీటిలో మునిగిపోయింది. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటతో 180కి పైగా రోడ్లు మూసుకుపోయాయి.
కేదార్ నాథ్ లోయలోని లారాగ్రామాన్ని పట్టణతో కలిసే వంతెన కొట్టుకపోవడంతో ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల ద్రుష్ట్యా రుద్రప్రయాగ్, బాగేశ్వర్ ,చమోలి, హరిద్వార్ మొదలైన జిల్లాల్లోని విద్యాలయాలను మూసివేశారు. ఉత్తరాఖండ్ లో భారీ వరదలు స్రుష్టిస్తున్న కల్లోలంపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు.
రుద్ర ప్రయాగ్ లోని బాసుకేదర్ తహసీల్, చమోలి జిల్లాలోని దేవల్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఎన్నో కుటుంబాలు వరదల్లో చిక్కుకుపోయాయని తెలిపారు. నీరు ఉద్ధ్రుతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. వరద ప్రవాహంప్రమాదస్థాయికి చేరువలో ఉండటంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేస్తున్నట్లు తెలిపారు.


