మేడారం జాతరలో మగబిడ్డ జననం
తల్లీ–బిడ్డాక్షేమం.. జాతరలో పుట్టడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం
కాకతీయ, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు అమ్మవార్ల దర్శనానికి వచ్చిన ఓ గర్భిణీ సురక్షితంగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈసంఘటన భక్తులను ఆనందానికి గురి చేసింది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మౌలాలి గాంధీనగర్‌కు చెందిన రజిత అనే గర్భిణీ కుటుంబ సభ్యులతో కలిసి మేడారం జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంది. దర్శనం పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో రజితకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందగా, అక్కడే బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. పోలీసులు వెంటనే 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది ప్రాథమిక పరీక్షలు చేసి, మేడారం జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య శిబిరానికి గర్భిణీని తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో సురక్షిత ప్రసవం నిర్వహించారు. వైద్యుల సేవలతో రజిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అవసరమైన వైద్య సంరక్షణ అందిస్తున్నామని చెప్పారు. మేడారం జాతరలోనే తన బిడ్డ పుట్టడం ఎంతో సంతోషంగా ఉందని రజిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అమ్మవారి ఆశీస్సులతో బిడ్డ జన్మించాడని భావిస్తున్నామని తెలిపారు.



