జోరుగా నామినేషన్లు
ఐదు మున్సిపాలిటీల్లో రెండో రోజే 309 దాఖలు
బీఆర్‌ఎస్–కాంగ్రెస్ మధ్య పోటాపోటీ
కాకతీయ, ఖమ్మం జిల్లా ప్రతినిధి :మున్సిపల్ ఎన్నికల వేడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నామినేషన్ల రెండో రోజే భారీ సంఖ్యలో దాఖలయ్యాయి. మొత్తం 117 వార్డులకు గాను 309 నామినేషన్లు స్వీకరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మున్సిపాలిటీ వారీగా చూస్తే ఏదులాపురంలో 85, వైరాలో 60, సత్తుపల్లిలో 59, కల్లూరులో 76, మధిరలో 29 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల పోటీతో నామినేషన్ కేంద్రాలు రాజకీయ హడావుడితో కిటకిటలాడాయి. పార్టీల వారీగా పరిశీలిస్తే భారత రాష్ట్ర సమితి మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో కలిపి 124 నామినేషన్లు దాఖలు చేసి ముందంజలో నిలిచింది. అధికార కాంగ్రెస్ పార్టీ 114 నామినేషన్లతో గట్టి పోటీ ఇస్తోంది. భారతీయ జనతా పార్టీ తరఫున 35, సీపీఐ (ఎం) 23 నామినేషన్లు దాఖలు చేసింది. స్వతంత్ర అభ్యర్థులు 10, తెలుగుదేశం పార్టీ తరఫున 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ముందున్న రోజుల్లో నామినేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


