లాంఛనాల మధ్య గద్దెపైకి సమ్మక్క
అగ్రం పహాడ్‌కు లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం
గాల్లోకి కాల్పులు జరిపిన ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్
కాకతీయ, ఆత్మకూరు : కొంగుబంగారమైన వనదేవత సమ్మక్క ఆగమనంతో అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతర భక్తి పారవశ్యంతో ఉప్పొంగింది. తెలంగాణలోనే ‘రెండో మేడారం’గా పేరొందిన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్‌లో జాతర వేళ జనసంద్రం వెల్లువెత్తింది. జిల్లాలకే కాదు.. రాష్ట్రాలు దాటి కుటుంబ సమేతంగా భక్తులు తరలిరావడంతో గ్రామం జనారణ్యంగా మారింది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరలో వనదేవతలను దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పాడిపంటలు కలుగుతాయన్న అపార విశ్వాసంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. “శరణు శరణు సమ్మక్కమ్మా” అంటూ నామస్మరణతో అగ్రంపహాడ్ పరిసరాలు మార్మోగాయి.

లాంఛనాల మధ్య సమ్మక్క రాక
జాతరలో కీలక ఘట్టంగా సమ్మక్క గద్దెపైకి చేరుకునే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రభుత్వ లాంఛనాలతో పరకాల ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పాల్గొన్నారు. సంప్రదాయ ప్రకారం డీసీపీ గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతకు ఘన స్వాగతం పలికారు. పూజారులు ఆదివాసీ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించగా, భారీ పోలీస్ బందోబస్తు నడుమ సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చారు. సమ్మక్క రాక వార్తతో భక్తులు ఒక్కసారిగా ముందుకు కదిలారు. ఎదురుకోళ్లు సమర్పిస్తూ, కొబ్బరికాయలు, పూలు చల్లుతూ అమ్మవారిని వేడుకున్నారు. లక్షలాది మంది ఒకేసారి కదలడంతో కొంతసేపు తోపులాట చోటుచేసుకుంది. పూజారులను తాకేందుకు భక్తులు ఉత్సాహంగా ముందుకు రావడంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. చివరకు అధికారులు, పోలీసుల సమన్వయంతో సమ్మక్కను సురక్షితంగా గద్దెపైకి చేర్చారు.
భక్తి.. వ్యాపారం.. ఆందోళనలు
భారీ రద్దీ నేపథ్యంలో కొబ్బరికాయలు, బంగారం ధరలు అమాంతం పెరిగాయి. కొందరు వ్యాపారులు అవకాశంగా తీసుకుని అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జాతర ప్రాంగణంలో గుడుంబా, మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, తలనీలాలు సమర్పించి, మొక్కులు చెల్లిస్తూ భక్తులు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో అగ్రంపహాడ్ జాతర మినీ మేడారంలా మారి, ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారుతోంది.


