మద్ది మేడారంలో గద్దెలపైకి వనదేవతలు
కాకతీయ, నల్లబెల్లి : వేలాదిగా తరలివచ్చిన భక్త జనంతో నల్లబెల్లి మండలంలోని మద్ది మేడారం, టేకుల మేడారం జాతరలు గురువారం కిటకిటలాడాయి. వనదేవత సమ్మక్క గద్దెలపై కొలువు దీరించడంతో జాతర ప్రాంగణమంతా భక్తుల తాకిడితో నిండిపోయింది. గురువారం ఉదయం నుంచే శివసత్తుల పూనకాలు, భక్తుల కేరింతలు, జైకారాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి మద్ది మేడారానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవారి గద్దెల సమీపంలోని ఆలయ ప్రాంగణంలో నాగుపాము దర్శనమివ్వడంతో భక్తులు దానిని దేవుడి మహిమగా భావించి పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
“తల్లి సమ్మక్క–సారలమ్మ మమ్మల్ని సల్లగా చూడాలమ్మ” అంటూ గిరిజన దేవతలను వేడుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.


