సిల్వర్ జోన్ ఒలంపియాడ్‌లో అల్ఫోర్స్ హవా
అత్యధిక బంగారు పతకాలు సాధించిన ఇ–టెక్నో స్కూల్
ఇంగ్లీష్‌లో పట్టు ఉంటే అంతర్జాతీయ అవకాశాలు: డా. నరేందర్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ : సిల్వర్ జోన్ ఫౌండేషన్ నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీష్ ఒలంపియాడ్‌లో కొట్టపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు అత్యధిక బంగారు పతకాలు సాధించి మెరుపు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంగ్లీష్ భాషపై పట్టు సాధిస్తే విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇంగ్లీష్‌ను కేవలం మాట్లాడే భాషగా కాకుండా, విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకునే స్థాయికి చేరుకోవాలని సూచించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భాష కావడంతో విద్యార్థుల భవిష్యత్తుకు ఇది కీలకమని పేర్కొన్నారు. ఈ ఒలంపియాడ్‌లో వి. వేదవిహార్ (4వ తరగతి), కె. సుకృత (5వ తరగతి), బి. తన్మయి (7వ తరగతి), టి. అమితా విక్రం (9వ తరగతి)తో పాటు పలువురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించడం గర్వకారణమని అన్నారు. విజేతలకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


