సమ్మక్క–సారలమ్మను దర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కొత్తగట్టులో మత్స్యగిరింద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో సమ్మక్క–సారలమ్మ అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. వనదేవతల ఆశీర్వాదంతో రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు కురిసి, పాడి పంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని, పేదల కోసం చేపడుతున్న కార్యక్రమాలు నిరంతరాయంగా ముందుకు సాగాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి చెప్పారు.
అదే విధంగా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలోని శ్రీ మత్స్యగిరింద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు మంత్రి హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మత్స్యగిరింద్ర స్వామి వారి కళ్యాణం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధి వర్షాలు కురిసి, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ సహకారం, దాతల తోడుతో దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. గతంలో పార్లమెంట్ సభ్యుడిగా, ప్రస్తుతం మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మత్స్యగిరింద్ర స్వామి భక్తుడిగా దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.


